Riyaz encounter should be investigated by a sitting High Court judge demands Human Rights Forum: రియాజ్ ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి
ఇవాళ ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్ ని పోలీసులు చంపేయటం బూటకపు ఎన్ కౌంటర్ మాత్రమే కాక, ఇది తెలంగాణా పోలీసు శాఖలో పెరుగుతున్న హింసాప్రవృత్తికి నిదర్శనం.
ఈ నెల 17వ తేదీ శుక్రవారం రోజున తరచుగా బైకులు, చైన్ స్నాచింగ్ లాంటి దొంగతనాలు చేసే షేక్ రియాజ్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో అతను బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ ప్రమోద్ ను పాశవికంగా కత్తితో పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. ఊహించని ఈ దాడి కారణంగా కానిస్టేబుల్ దాదాపు అక్కడికక్కడే చనిపోయాడు.
ఆ కానిస్టేబుల్ న్యాయంగా డ్యూటీ నిర్వహిస్తుండగా, అతనిపై జరిగిన దాడిలో చనిపోవటం చాలా బాధాకరం. ఇది అందర్నీ నిర్గాంతపరిచిన విషయం. హంతకునికి అందుకుగానూ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అయితే ఆ శిక్షను ఎవరు అమలు చేయాలనేదే నాగరిక సమాజంలో కీలకమైన విషయం.
నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుండి తప్పించుకోకుండా పోలీసులు తగిన సాక్ష్యాధారాలతో అతని నేరాన్ని నిరూపించి, చట్ట ప్రకారం కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయటానికి ఇక్కడ పూర్తి అవకాశాలున్నాయి. చట్టాన్నీ, రాజ్యాంగాన్నీ, కోర్టులనూ గౌరవించే వ్యవస్థలు వాస్తవంగా ఆ పని చేయాలి. కానీ, అలా కాకుండా పోలీస్ వ్యవస్థ రియాజ్ ను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తున్నది.
నిన్న ఉదయం, రియాజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత, నుండే రియాజ్ ను ‘ ఎన్కౌంటర్ ‘ చేశారనే వార్తలు వచ్చాయి. స్వయంగా నిజామాబాద్ సీపీ కల్పించుకొని (ఇప్పటివరకు) ఎన్కౌంటర్ జరగలేదని చెప్పాల్సి వచ్చింది. ఇవ్వాళ ఉదయం ‘ ఎన్ కౌంటర్ ‘ జరిగిందట.
ఇది పూర్తిగా ముందస్తు పథకం ప్రకారమే పోలీసుల మీద మరొకరు తిరుగుబాటు చేయకుండా, రియాజ్ ఉదంతం ఒక బెదిరింపుగా ఉండాలని చేసిన కౌంటర్ హత్య అని మా అనుమానం. తెలంగాణ పోలీసుల మానసిక వైఖరీ, వారి ‘ఎన్ కౌంటర్ల చరిత్ర‘ లే ఇందుకు ఆధారాలు.
Riyaz encounter should be investigated demands Human Rights Forum
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు అంటే తెలియని సామాన్య ప్రజలు ఈ విషయంలో పోలీసులకు వత్తాసు పలుకుతుండవచ్చు గాక. కానీ, ఒక సమాజం నియమబద్ధంగా నడావలా లేక, కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఆటవిక సమాజం లాగా నడవాలా అనేది మెజారిటీ మద్దతు ఉందనే పేరుతో నడవాల్సిన వ్యవహారం కాదు.
ఒక ఆసుపత్రి నాలుగవ అంతస్తులో, చుట్టుపక్కల వేరెవరు రోగులూ, వారి బంధువులూ లేకుండా ఉంచిన గదిలో జరిగిన ఈ హత్య నిజమైన ఎన్ కౌంటర్ కాదని, బూటకపు ఎన్కౌంటర్ అని నిరూపించడానికి మృతుని బంధువులకు గానీ, హక్కుల సంఘాలకు గానీ, స్వచ్ఛంద సంస్థలకు గానీ ఎటువంటి అవకాశం ఉండదు.
కాబట్టి రూల్ ఆఫ్ లాను, కోర్టులను, రాజ్యాంగ నియమాలని కాపాడటమా లేక ‘ వారిలో ఒక మనిషి చనిపోతే వారు ఊరుకుంటారా?‘ అని సరిపెట్టటమా అనేది ఈరోజు ప్రభుత్వం ముందూ, రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్ల ముందూ, హైకోర్టు, సుప్రీంకోర్టుల ముందూ ఉన్న ప్రశ్న.
